Trump | భారత్‌కు అండగా అమెరికా..

  • దాడి జరిగితే సాయం చేస్తాం
  • హోర్ముజ్ ఘటనలో మృతి చెందిన భారత నావికులపై స్పందన

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు బలమైన మద్దతు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ట్రంప్, భారత్-అమెరికా రక్షణ సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌పై ఏదైనా బాహ్య దాడి జరిగితే అమెరికా అండగా నిలుస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్‌తో మా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని… ముఖ్యంగా ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌పై ఎలాంటి దాడి జరిగినా అమెరికా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అదే సమయంలో హోర్ముజ్ జలసంధి సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటనపై కూడా ట్రంప్ స్పందించారు. సముద్ర రవాణా రంగం అత్యంత ప్రమాదకరమైన వృత్తుల్లో ఒకటని పేర్కొన్నారు. నావికుల పని చాలా కఠినమైనది, ప్రమాదకరమైనది. చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. సముద్రాల్లో పనిచేసే వారు ఎప్పుడూ ప్రమాదాలను ఎదుర్కొంటూనే ఉంటారు అని ట్రంప్ అన్నారు. హోర్ముజ్ జ‌ల‌సంధి ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయని, సముద్ర రవాణా భద్రతకు ఇరు దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు.

హోర్ముజ్ భద్రతపై చర్చ..

జీ7 సదస్సులో ప్రధాని మోడీ కూడా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావాన్ని ప్రస్తావించారు. పశ్చిమాసియా ఘర్షణల సమయంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేస్తూ, సముద్ర మార్గాల భద్రత అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి భద్రత, అంతర్జాతీయ వాణిజ్య రవాణా అంశాలపై భారత్-అమెరికా మధ్య సమన్వయం మరింత పెరుగుతున్నట్లు జీ7 సదస్సు చర్చలు సూచిస్తున్నాయి.