దివ్యాంగులు, వృద్ధులకు కొత్త వెలుగు..
దివ్యాంగులు, వృద్ధులకు కొత్త వెలుగు..
\రూ.4 కోట్ల పరికరాల పంపిణీకి ఏర్పాట్లు
నంద్యాలలో 3 వేల మందికి సహాయక ఉపకరణాలు..
ఎంపీ బైరెడ్డి శబరి చేతుల మీదుగా పంపిణీ
కర్నూలు, ఆంధ్రప్రభ : దివ్యాంగులు, వయోవృద్ధుల జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసం నింపే దిశగా నంద్యాల పార్లమెంట్ పరిధిలో భారీ సంక్షేమ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సుమారు రూ.4 కోట్ల విలువైన సహాయక పరికరాలను మూడువేల మందికి పైగా లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నంద్యాల పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు అండగా నిలుస్తూ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఏడీఐపీ (ADIP) పథకం, వృద్ధుల సంక్షేమ పథకాల కింద అర్హులకు సహాయక పరికరాలు అందించనున్నారు.
ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు నంద్యాల టెక్కె వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి చేతుల మీదుగా పరికరాలను పంపిణీ చేయనున్నారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఏడీఐపీ పథకం కింద ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) సహకారంతో అవసరమైన సహాయక పరికరాలను అందించనున్నారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సంక్షేమ పథకాల కింద కూడా పలు ఉపకరణాలను పంపిణీ చేయనున్నారు.
గత ఏడాది జూన్ 28 నుంచి జూలై 18 వరకు నంద్యాల జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక అసెస్‌మెంట్ శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులను గుర్తించి వారి అవసరాలను నమోదు చేశారు.
అనంతరం వారికి అవసరమైన వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలు, వాకింగ్ స్టిక్స్‌తో పాటు ఇతర ఆధునిక సహాయక ఉపకరణాలను సిద్ధం చేయించారు. ప్రస్తుతం అన్ని పరికరాలు నంద్యాలకు చేరుకోగా, పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
దివ్యాంగులు, వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, స్వయం ఆధారిత జీవనానికి ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించనున్నాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
