సంప్రదాయబద్దంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..

సంప్రదాయబద్దంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..

ఉదయం శోభాయమానంగా జరిగిన కలశయాత్ర…
కలశయాత్రలో పాల్గొన్న సుమారు 1000 మంది భక్తులు…
శివపంచాక్షరీ నామలేఖన యజ్ఞం ఘనంగా..
ఎల్.ఈ.డి స్క్రీన్‌పై ప్రదర్శించబడిన జాతీయ ప్రసారం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో వెలిసిన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించబడిందని కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు,తెలిపారు. దేవస్థానంలో ఈ కార్యక్రమంలో ధర్మకర్తలమండలి ప్రత్యేక ఆహ్వానితులు కారుపర్తి నాగమల్లేశ్వరరావు, ఆకుల శ్రీనివాసులు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువురు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉదయం ఆలయ ప్రాంగణములోని అక్కమహాదేవి అలంకారమండపంలో సహస్రకలశరాధన కార్యక్రమం నిర్వహించబడిందన్నారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించబడింది. తరువాత సహస్రకల శారాధన కార్యక్రమం జరిగింది. గంగానది పుణ్యనదీజలాలను కలశంలోకి ఆహ్వానిస్తూ కలశారాధన నిర్వహించబడింది. కలశారాధన తరువాత పుణ్యజల కలశాలను భక్తులకు అందజేయబడ్డాయన్నారు.

భక్తులందరు కూడా భక్తిశ్రద్ధలతో కలశాలను తలపై ధరించి కలశయాత్రలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం నుంచి గంగాధర మండపం వరకు, అక్కడి నుంచి నందిగుడి వరకు, నందిగుడి నుంచి మల్లికార్జునసదన్ మీదుగా క్షేత్రపాలకుడైన బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఈ కలశయాత్ర కొనసాగిందన్నారు. ఈ సందర్భంగా బయలు వీరభద్రస్వామివారికి విశేషపూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం బయలు వీరభద్రస్వామి ఆలయం నుంచి గంగాధర మండపం మీదుగా ఆలయప్రాంగణం వరకు కలశయాత్ర కొనసాగించబడిందన్నారు.

కలశయాత్ర అనంతరం శ్రీవృద్ధమల్లికార్జునస్వామివారికి శాస్త్రోక్తంగా కలశాభిషేకం జరిపించబడింది. ఈ కలశయాత్రలో సుమారు 1000 మంది భక్తులు పాల్గొన్నారు. కలశయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీస్వామి వారి అలంకార దర్శనం, అమ్మవార్ల దర్శనం కల్పించబడింది. శివపంచాక్షరీ నామలేఖన యజ్ఞం ఘనంగా నిర్వహించారు. కలశయాత్ర తరువాత శివపంచాక్షరీ నామలేఖన యజ్ఞకార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో భక్తులందరు కూడా శివపంచాక్షరీ నామాన్ని లిఖించేందుకు వ్రాసేందుకు వీలుగా శివపంచాక్షరీ పుస్తకాలను, కలములు పెన్నులు దేవస్థానం భక్తులకు అందజేసింది. అనంతరం భక్తులందరు కూడా శివపంచాక్షరీ మంత్రాన్ని వ్రాయడం జరిగింది. ఈ శివపంచాక్షరి పుస్తకాలను శ్రీస్వామిఅమ్మవార్లకు సమర్పించడం జరుగుతుంది.

ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు :

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగానే ఈ సాయంకాలం గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వేదిక వద్ద పలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. సాయంత్రం గం. 5.30లకు శ్రీ సత్యంస్వామి మరియు వారి బృందం, వనపర్తి వారిచే శివభజనలు నిర్వహించబడుతాయన్నారు. తరువాత గం. 6.30లకు శ్రీ తాతా సందీప్‌శర్మ, రాజమహేంద్రవరం వారిచే ఓంకార ప్రాశస్త్యంపై ప్రవచనం ఏర్పాటు చేయబడిందన్నారు.

అనంతరం రాత్రి గం. 7.30ల నుంచి సుప్రియ బృందం, విజయనగరం వారిచే పేరిణి శివతాండవం ప్రదర్శించబడుతోంది. కాగా ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ సోమనాథ ఆలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వ సాంస్కృతికశాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరున పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇందులో భాగంగా దేవదాయశాఖ ఉత్తర్వుల మేరకు దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ ధార్మికచైతన్యానికి, సంప్రదాయ పరిరక్షణకు దేవాలయమే ఆలవాలమన్నారు. అందుకే సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యవస్థలో దేవాలయానికి ఎంతో ప్రత్యేక స్థానముందన్నారు. ధర్మం అనేది సమాజాన్ని సక్రమమార్గంలో నడిపిస్తుందన్నారు. ధర్మాచరణ వల్ల పటిష్టమైన సమాజం ఏర్పడుతుందన్నారు.

Leave a Reply