TG High Court | దోషులు ఎప్పటికైనా జైలుకే

TG High Court | దోషులు ఎప్పటికైనా జైలుకే

TG High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కోర్టు మొత్తం దర్యాప్తును కాదు, కేవలం విధానపరమైన అంశాలపైనే అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆయన స్పష్టం చేశారు.

హైకోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తదుపరి చర్యలను నిర్ణయిస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. కమిషన్ నివేదికను పూర్తిగా తప్పుబట్టినట్లు కొన్ని వర్గాలు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలు గతంలోనే వెలువడ్డాయని, దీనిపై వివిధ రాజకీయ పార్టీలు కూడా స్పందించాయని గుర్తు చేశారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దోషులు ఎవరైనా సరే తప్పించుకోలేరని, ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ప్రజా ధనంతో చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం తప్పనిసరి అని అన్నారు.

అలాగే ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలో బీజేపీ నేతలే ఆరోపించలేదా? అయితే ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు నిజాలు తెలియజేయడం తమ బాధ్యత అని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Leave a Reply