మీతోనే…మేమూ..

మీతోనే…మేమూ..

  •  సమస్యల పరిష్కారం లక్ష్యం
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే వెల్లడి
  • మైలవరంలో 595 అర్జీల స్వీక‌ర‌ణ‌..

( ఆంధ్రప్రభ మైలవరం)

ప్రజ‌ల వెతలు తీర్చడానికే నియోజకవర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యుడు వ‌సంత వెంక‌ట కృష్ణప్రసాద్ అన్నారు.  శాసనసభ్యుడు వసంత వెంక‌ట కృష్ణప్రసాద్ తో కలిసి క‌లెక్టర్ ల‌క్ష్మీశ మైల‌వ‌రంలోని ఎస్‌వీ క‌ళ్యాణ‌మండ‌పంలో మంగ‌ళ‌వారం పీజీఆర్ఎస్   నిర్వహించారు. నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించి వాటి త‌క్షణ ప‌రిష్కారానికి అధికారుల‌కు అక్కడిక‌క్కడే ఆదేశాలు ఇచ్చారు.

నియోజ‌క‌వ‌ర్గ స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 595  అర్జీలు వ‌చ్చాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రైస్ కార్డులు, ఉపాధి, పెన్షన్లు త‌దిత‌రాల‌తో పాటు వివిధ రెవెన్యూ సేవ‌ల‌కు సంబంధించి కూడా అర్జీలు వ‌చ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రాన‌వ‌సరం లేకుండా నియోజకవర్గ స్థాయిలోనే తమ సమస్యలు తెలియజేసే అవకాశాన్ని నియోజకవర్గ పీజీఆర్ఎస్ కార్యక్రమాలు క‌ల్పిస్తున్నట్టు తెలిపారు.  జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రజల చెంతకు వచ్చిందని తెలిపారు

శాస‌న‌స‌భ్యడు  వ‌సంత వెంక‌ట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజా క్షేమం, సంక్షేమం ల‌క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని.. ప్రజ‌ల స‌మ‌స్యల‌ను తెలుసుకొని వాటిని వీలైనంత త్వర‌గా ప‌రిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

ఈ కార్యక్రమంలో జాయింట్ క‌లెక్టర్ ఎస్‌.ఇల‌క్కియ‌, గ్రామ వార్డు స‌చివాల‌యాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నియోజ‌క‌వ‌ర్గ ప్రత్యేక అధికారి టి.వి.స‌తీష్‌, ఏసీపీ కె.వెంక‌టేశ్వర‌రావు, వివిధ శాఖ‌ల అధికారులు   పాల్గొన్నారు.

Leave a Reply