Andhra Pradesh Aqua | రొయ్య రైతులను దెబ్బతీస్తున్న సిండికేట్‌ ముఠాలు

Andhra Pradesh Aqua | రొయ్య రైతులను దెబ్బతీస్తున్న సిండికేట్‌ ముఠాలు

Andhra Pradesh Aqua | కరువైన మద్దతు ధర
పెరిగిన ఫీడ్‌ ధరలు
క్రాప్‌ హాలిడేకు సిద్ధం

Andhra Pradesh Aqua | అమరావతి, ఆంధ్రప్రభ: కోనసీమ డాలర్‌ పంట కష్టాలను ఎదుర్కొంటోంది. మీసం తిప్పిన రొయ్య పౌరుషం తగ్గింది. రైతుల బలహీనతను ఆసరా చేసుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల రైతును ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. కొద్ది రోజులుగా రొయ్యల రేట్లు నేలచూపు చూస్తుండడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ఒక దశలో ఆశించిన ధర రాలేదని రొయ్యలను రోడ్డుపై పడవేసి నిరసనలు సైతం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5.74 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. రూ.21,246 కోట్ల విలువైన సరుకు ఎగుమతి అవుతోంది.

దేశంలో రాష్ట్ర వాటా 34 శాతం కాగా, ఇందులో అత్యధిక భాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే సాగవుతుంది. ప్రస్తుతం రొయ్యలు సాగుచేసిన రైతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకపక్క యుద్ధ ప్రభావం, మరోపక్క వేసవి తీవ్రత రొయ్య ఉనికికే ప్రశ్నార్థకంగా మారాయి. ఎండ, ఉక్కపోతలను లెక్కచేయక చెరువుల వద్దే పడిగాపులు పడుతూ పంట పండించినా, రొయ్య కొనుగోలు రేట్లు తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కరువైన మద్దతు ధర

రొయ్యల సాగులో పశ్చిమ గోదావరి జిల్లాదే అగ్రస్థానం. రాష్ట్రంలో ఆక్వా రంగం ఎగుమతుల్లో 51 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. అయితే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ రొయ్యల సాగు జరుగుతుంది. కేజీకి రూ.50 వరకు ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. ఒకప్పుడు డాలర్ల పంటగా పిలుచుకున్న రొయ్యల సాగు, నేడు పెట్టుబడులు పెరిగి, మద్దతు ధర కరువై రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది.

ఓవైపు వేసవి వేడి, మరోవైపు కౌంట్‌ ధరలు తగ్గిపోవడంతో చెరువులో నుంచి రొయ్యను బయటికి తీయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగని చెరువులో ఉంచితే పీహెచ్‌, వ్యాధుల బెడద పొంచి ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

వేసవి పరిస్థితులు ఓవైపు, సిండికేట్‌ ముఠాలు మరోవైపు దీనికి కారణమని రైతులు చెబుతున్నారు. రొయ్యల సాగు చేయాలంటే భారీగా పెట్టుబడి పెట్టక తప్పని పరిస్థితులు ఓవైపు, అంత పెట్టుబడులు పెట్టినా చివరకు లాభాలు వస్తాయా అంటే అదీ అనుమానమే అన్న పరిస్థితులు రైతులను కృంగదీస్తున్నాయి. రొయ్య రైతుల పరిభాషలో 100 కౌంట్‌ పడితే ఆ చెరువు సేఫ్‌గా ఉన్నట్టేనని చెబుతారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ప్రస్తుతం మార్కెట్లో ధరలు 100 కౌంట్‌కు రూ.215, 90 కౌంట్‌కు రూ.225, 80 కౌంట్‌కు రూ.235, 70 కౌంట్‌కు రూ.250, 60 కౌంట్‌కు రూ.265, 50 కౌంట్‌కు రూ.275, 40 కౌంట్‌కు రూ.305, 30 కౌంట్‌కు రూ.365 పలుకుతున్నాయి. ఫిబ్రవరిలో 100 కౌంట్‌ రొయ్యలు రూ.270 ఉంటే, ఇప్పుడు అవి కాస్తా రూ.220కి తగ్గిపోయాయి. ఈ నెలలో 60 కౌంట్‌ రూ.310 ఉంటే, మే 22కి రూ.295కి, 25, 26 తేదీలకు రూ.280కి తగ్గిపోయిందని రొయ్యల రైతులు చెబుతున్నారు. అలాగే ఒకటి, రెండు టన్నులుంటే కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతు కష్టాలు రెట్టింపవుతున్నాయి. దళారులు, ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి తమను నిలువునా దోచుకుంటున్నారని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు.

పెరిగిన ఫీడ్‌ ధరలు

ఏడాది కాలంగా రొయ్యల మేత ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది టన్ను రొయ్య మేత ధర రూ.65 వేల నుంచి రూ.75 వేల వరకు ఉండగా, ఇప్పుడు రూ.90 వేల నుంచి రూ.95 వేల వరకు పెంచారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. టన్నుకు అదనంగా రూ.20 వేలు భరించాల్సి వస్తోంది. రొయ్య రేటు తగ్గుదల వల్ల టన్నుకు రూ.45 వేల రూపాయలు నష్టపోతున్నారు.

ఒకప్పుడు రొయ్య మేత షాపుల వాళ్లు అరువులు ఇచ్చి, పంట పండాక జమ చేసే అవకాశం కల్పించేవారు. కానీ, నేడు ఆక్వా పరిశ్రమ పూర్తిగా దెబ్బతినడంతో రైతులపై నమ్మకం సన్నగిల్లిందని మేతల కంపెనీలు చెబుతున్నాయి. దీంతో రైతులు తమ పంటను కాపాడుకోవడం కోసం ఏజెంట్లు, ఫీడ్‌ షాపుల వాళ్లకు సొమ్ములు చెల్లిస్తేనే మేత ఇస్తామని చెప్పడంతో, అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు.

క్రాప్‌ హాలిడేకు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 29న అమలాపురంలో ఏపీ రాష్ట్ర ఆక్వా రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆక్వా రైతు సంఘం నాయకులు తెలిపారు. ఫీడ్‌, సీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు.

రొయ్యల ధర తగ్గించి కొనుగోలు చేస్తున్న ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని, మేత ధర పెంచి విక్రయిస్తున్న కంపెనీలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం శీతలీకరణ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply