కృష్ణ, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగిస్తున్నారు
- కృష్ణ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది
- ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఎడారిగా మారే ప్రమాదం
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రవహిస్తున్న కృష్ణ, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అప్పగిస్తున్నారని, నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు.గురువారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
కృష్ణ, గోదావరి జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదని, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర నదిపై గత ట్రిబ్యునల్ తీర్పులకు విరుద్ధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.తుంగభద్రపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే శ్రీశైలం జలాశయానికి ప్రతి ఏడాది వచ్చే 400 టీఎంసీల నీరు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుగా ఉపయోగిస్తూ కృష్ణా జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తోందని ఆరోపించారు.
తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను పెద్దఎత్తున తరలిస్తున్నారని, కాలక్రమేణా కాలువల సామర్థ్యాన్ని పెంచుతూ నీటి వినియోగాన్ని విస్తరించారని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.ప్రజలు అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని, ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.ఇప్పటికైనా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం గళం విప్పాలని, ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం బీఆర్ఎస్ ఉద్యమం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి మెట్టు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
