ఇస్లామాబాద్‌లోని ఆమె నివాసంలోనే కాల్చి చంపిన బంధువు
నిందితుడు పరారీ,
పరువు హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు
సనాకు సోషల్ మీడియాలో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు
మహిళా హక్కులు, చిత్రాల్ సంస్కృతిపై వీడియోలు చేసే సనా
ఇస్లామాబాద్ – పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ సనా యూసుఫ్ దారుణ హత్యకు గురైంది. ఇస్లామాబాద్‌లోని ఆమె నివాసంలోనే ఈ దారుణం జరిగింది. ఆమెను చూడటానికి వచ్చిన ఓ బంధువే అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన పాకిస్థాన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
అప్పర్ చిత్రాల్ ప్రాంతానికి చెందిన సనా యూసుఫ్ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండేది. ఆమెకు దాదాపు 4 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మంగళవారం ఆమెను కలవడానికి వచ్చిన ఓ బంధువు ఇంటి బయట సనాతో కొంతసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో సనా శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు.
ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ హత్య వెనుక అనేక కోణాలు ఉండవచ్చని, ముఖ్యంగా పాకిస్థాన్‌లో తరచూ జరుగుతున్న పరువు హత్యల కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని ఓ పోలీస్ అధికారి చెప్పినట్టు పాకిస్థానీ మీడియా పేర్కొంది.
సామాజిక కార్యకర్త కుమార్తె అయిన సనా యూసుఫ్ తన వీడియోల ద్వారా ఎక్కువగా రోజువారీ జీవనశైలి, చిత్రాల్ సంస్కృతి, మహిళల హక్కులు, విద్య ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించేది. యువతకు ప్రేరణ కలిగించే కంటెంట్‌ను కూడా రూపొందించేది. ఆమె హత్య వార్త తెలియగానే సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. #JusticeForSanaYousuf వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపై ట్రెండింగ్‌లో ఉన్నాయి.
పాకిస్థాన్‌లో మహిళల విద్యా హక్కుల కోసం గళమెత్తిన మలాలా యూసఫ్‌జాయ్‌పై 2012లో తాలిబన్లు జరిపిన దాడిని ఇది గుర్తుకు తెస్తోంది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో కూడా పాకిస్థాన్‌లో టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న కారణంగా ఓ తండ్రి తన టీనేజ్ కుమార్తెను హత్య చేసిన ఉదంతం సంచలనం సృష్టించింది. ఆ కుటుంబం ఇటీవలే అమెరికా నుంచి పాకిస్థాన్‌కు తిరిగి వచ్చింది. మొదట గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని ఆ తండ్రి చెప్పినప్పటికీ, విచారణలో అసలు విషయం బయటపడింది.