Munugodu | బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు ఆత్మీయ వీడ్కోలు
Munugodu | బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు ఆత్మీయ వీడ్కోలు
- ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని సన్మానించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
మునుగోడు, ఆంధ్రప్రభ: మునుగోడు మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బందిని ఎంపీడీవో మేకల విజయభాస్కర్, ఎంపీఓ, సర్పంచులు కలిసి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, మండల అభివృద్ధికి చేసిన కృషి, ప్రజలకు అందించిన సేవలను కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
బదిలీపై వెళ్తున్న ఉద్యోగులు మాట్లాడుతూ, మునుగోడు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. తమ సేవా కాలంలో అందరి సహకారంతోనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలిగామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
