ఆరేళ్లుగా అరకొర రహదారి..
ఆరేళ్లుగా అరకొర రహదారి..
- ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
- ములకనూరు–దురదకుంట రోడ్డుపై గ్రామస్తుల ఆవేదన
- ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
- ఇప్పటికైనా స్పందించి రహదారి నిర్మించాలని విజ్ఞప్తి
అనంతపురం, కళ్యాణదుర్గం ఆంధ్రప్రభ ప్రతినిధి : అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా కొన్ని గ్రామాల ప్రజలు కనీస రహదారి సౌకర్యం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. కంబదూరు మండలంలోని ములకనూరు గ్రామం నుంచి దురదకుంట గ్రామానికి వెళ్లే రహదారి దుస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ఈ రహదారిపై కంకర పరచి పనులు ప్రారంభించిన అధికారులు, ఆ తర్వాత మాత్రం రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా మరిచిపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి అదే కంకర రహదారిపై ప్రజలు నిత్యం ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. వర్షాకాలంలో బురద, వేసవిలో దుమ్ముతో ఈ మార్గం నరకయాతనను తలపిస్తోందని వారు చెబుతున్నారు.
ప్రతిరోజు విద్యార్థులు, రైతులు, వృద్ధులు, మహిళలు ఈ రహదారిపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చినా, గర్భిణులు, వృద్ధులను తరలించాల్సి వచ్చినా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
ఈ సమస్యపై గ్రామస్తులు గతంలో ఎన్నోసార్లు సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేశారని తెలిపారు. ప్రతి సారి హామీలు మాత్రమే లభించాయని, కానీ రోడ్డు మాత్రం ఇప్పటికీ పూర్తికాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడే నాయకులు తమ సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు.
ములకనూరు–దురదకుంట రహదారి మాత్రమే కాకుండా, ఐపార్సపల్లి గ్రామం వరకు రహదారి నిర్మాణ పనులను కూడా వెంటనే చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. రహదారి సౌకర్యం మెరుగుపడితే గ్రామాల మధ్య రాకపోకలు సులభమవడంతో పాటు రైతులకు, విద్యార్థులకు, సాధారణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ రహదారి పనులను పూర్తి చేసి గ్రామస్తుల కష్టాలకు ముగింపు పలకాలని ప్రజలు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలందరి చూపులు అధికార యంత్రాంగం వైపే ఆశగా చూస్తున్నాయి.
