పైప్‌లైన్ పనులు వేగవంతం చేయండి

పైప్‌లైన్ పనులు వేగవంతం చేయండి

అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : వేసవి కాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.ఎన్టీఆర్ జిల్లాఎ.కొండూరు మండలం మత్రియా తండా గ్రామపంచాయతీ పరిధిలోని చైతన్య నగర్ ప్రాంతాన్ని బుధవారం పరిశీలించిన సందర్భంగా గ్రామ అభివృద్ధి అధికారి ఉపేంద్రకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా జలాల సరఫరా వ్యవస్థలో ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేసి,నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

పైపుల మరమ్మత్తులు తక్షణమే పూర్తి చేసి,రక్షిత తాగునీటి పథకం కింద కొత్త పైప్‌లైన్ ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో బి. శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన ఈ పరిశీలనలో గ్రామంలోని నీటి వనరులు,నిల్వ సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైతే తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాత కొండూరు కాలనీ, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

అదే సమయంలో స్థానిక ప్రజలకు డిజిటల్ జనగణనపై అవగాహన కల్పించారు.ప్రతి కుటుంబం తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని సూచిస్తూ,ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుకోవడంలో జనగణన ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి.శ్రీనివాసరావు,గ్రామ అభివృద్ధి అధికారి ఉపేంద్ర,సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply