పథకాలపై అవగాహన కల్పిస్తున్న గ్రామ రైతు సేవా సహాయకులు

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు విఫలం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రూపాయి విలువను పెంచుతామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల్లో ఆ వాగ్దానాల అమలులో పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఉరవకొండలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజకీయ–సైద్ధాంతిక శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర
కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యల పరిష్కారం కంటే కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలకే ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని ఆరోపించారు. మోడీ పాలన లో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీ నపడిందని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గణనీయం గా పడిపోయిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విఫలమైన, కేంద్ర ప్రభుత్వం మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని, రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద విలువలను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు, దళితులపై దాడులు పెరుగుతున్నాయని, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే చర్యలను లౌకికవాద శక్తులన్నీ ఖండించాలని పిలుపు నిచ్చారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణకు ముప్పు ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును కాపాడుకోవా ల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ‘డబుల్ ఇంజన్’ పేరుతో రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ ని, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్న ప్రభుత్వం వాస్తవ గణాంకాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రకటనలే చేశారని, పెట్టుబడుల పేరిట ప్రచారం తప్ప ప్రజలకు ప్రయోజనం కనిపించడం లేదన్నారు. రూ.2 లక్షల కోట్లతో అమరావతి నిర్మాణం చేపడుతూ భారీగా అప్పులు చేస్తున్నారని తెలిపారు. ఆ నిధులన్నీ ఒకే ప్రాంతానికి ఖర్చు చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే అక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పటికే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో మళ్లీ భూసేకరణ చేపట్టడం ఎంతవరకు న్యాయమన్నారు.
హంద్రీ–నీవా, గండికోట వంటి కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదన్నారు. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమలు శంకుస్థాపనలకే పరిమితమై పోయాయని, వరుస ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.

అమరావతి, పోలవరం మినహా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఇతర అంశాల పై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయమైన పరిహారం కూడా అందడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, వర్షాభావం, పెరిగిన ఎరువులు–విత్తనాల ధరలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపో యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈశ్వరయ్య ప్రకటించారు. అలాగే సెప్టెంబర్ 1న ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రుణాల మాఫీ, ఆత్మహత్యలకు గురైన కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్లతో ఈ నెల 30న “చలో విజయవాడ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శులు రాజారెడ్డి, మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేశవరెడ్డి, రామకృష్ణ శ్రీరాములు, మల్లికార్జున, పద్మావతి, పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు, సహాయ కార్యదర్శి సుల్తాన్, నాగేంద్ర, బసవరాజు, రాజేష్ రామాంజనేయులు పాల్గొన్నారు.