పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జూన్ 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ..
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: ప్రిన్సిపాల్ అశ్రీఫ్ అలీ

ఉరవకొండ, రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని చిన్నముష్టూర్ గ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ అశ్రీఫ్ అలీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE), డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు జూన్ 24 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ లేదా హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుందని తెలిపారు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 24 నుంచి 30 వరకు
హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 25 నుంచి జూలై 1 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు: జూన్ 29 నుంచి జూలై 3 వరకు
సీట్ల కేటాయింపు: జూలై 6
కాలేజీల్లో రిపోర్టింగ్: జూలై 7 నుంచి 10 వరకు

ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.700 కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించినట్లు తెలిపారు.

ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్, బెలుగుప్ప, కూడేరు మండలాల విద్యార్థుల సౌకర్యార్థం చిన్నముష్టూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అర్హులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం యశస్వి మరియు ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందజేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తుందని చెప్పారు. అలాగే విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం, నిబంధనల మేరకు హాస్టల్ వసతి కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://polycet.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.