Modi | ప్రజల ఆశీర్వాదాలే మాకు బలం…
Modi | ప్రజల ఆశీర్వాదాలే మాకు బలం…
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన రూ.18,800 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రెండున్నర దశాబ్దాలకు పైగా గుజరాత్ ప్రజలు బీజేపీపై చూపిస్తున్న ఆదరణ… తమమై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి లభించిన ఘన విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సూరత్‌ను కేవలం ఒక నగరంగా కాకుండా ఓ ప్రత్యేక స్ఫూర్తిగా తాను భావిస్తానని మోదీ అన్నారు. నగర ప్రజల కృషి, చైతన్యం, అభివృద్ధి పట్ల వారి అంకితభావం సూరత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పారు. ఒకప్పుడు ప్లేగు వ్యాధితో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సూరత్.. నేడు పరిశుభ్రతకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
పరిశుభ్రతలో విజయాలు సాధించినప్పటికీ సూరత్ ప్రజలు అక్కడితో ఆగిపోకుండా మరింత శ్రమిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. ఇటీవల నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో సూరత్ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీ సూరత్‌లోని హజీరా ప్రాంతంలో ఉన్న లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) అత్యాధునిక తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఎ.ఎం. నాయక్ హెవీ ఇంజినీరింగ్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ వివిధ రంగాల్లో సాధిస్తున్న సాంకేతిక ఆవిష్కరణలను వీక్షించిన ప్రధాని, రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా సంస్థ పోషిస్తున్న పాత్రను అభినందించారు. డీఆర్‌డీవో, ఎల్‌అండ్‌టీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘జోరావర్’ తేలికపాటి యుద్ధ ట్యాంకుతో పాటు ఇతర రక్షణ పరికరాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.
సూరత్‌లో ప్రారంభించిన ప్రాజెక్టుల్లో 200 పడకల ఈఎస్‌ఐసీ ఆస్పత్రి కూడా ఉంది. అలాగే దమన్‌లో నామో ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం మీద గుజరాత్, దమన్ ప్రాంతాల్లో దాదాపు రూ.22 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు.
దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామికాభివృద్ధి, రక్షణ రంగ స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
