హైదరాబాద్, ఆంధ్రప్రభ : దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో సుజ్ఞానపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే… బైరాగులపాడు వద్ద ఉదయం వేగంగా వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ ఆగకుండా పారిపోయే ప్రయత్నం చేయగా, అది గమనించిన స్థానికులు వెంటనే వెంబడించి లారీని ఆపి డ్రైవర్‌ను పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. మృతుల కుటుంబీకులు లారీ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.