నక్కలంపేటలో గురువారం రాత్రి భారీ దొంగతనం….

నక్కలంపేటలో గురువారం రాత్రి భారీ దొంగతనం….

394 గ్రాముల బంగారం, 50 వేల నగదు అపహరణ ….
వరసగా మూడు ఇళ్ళను టార్గెట్ చేసిన దొంగలు…

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : కంచికచర్ల మండలం నక్కలంపేట గ్రామంలో దొంగలు యదేచ్చగా హల్ చల్ చేశారు. ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఇంట్లోనే నిద్రిస్తుండగానే తాళాలు పగులకొట్టి, ఇంట్లోకి ప్రవేశించి అలికిడి లేకుండా తాళాలను వెతికి తీసుకొని బీరువాలో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని ఉడాయించారు. మరో రెండు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడగా అక్కడ ఏమి దొరకపోవడంతో వెళ్లిపోయారు. కంచికచర్ల మండలం నక్కలంపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటనతో గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా నందిగామ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను బేజారెత్తిస్తున్నాయి.

నందిగామలో 12 రోజుల క్రితం రెండు రోజుల వ్యవధిలో భారీ దొంగతనాలు జరిగాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్ళే లక్ష్యంగా దుండగులు యదేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. నందిగామలో ఒక ఉపాధ్యాయుని ఇంట్లో తాళాలు పగలగొట్టి కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకుపోయిన సంఘటన మరువకముందే తాజాగా కంచికచర్ల మండలం పరిటాల శివారు నక్కలంపేటలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. తలుపులకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి మూడు ఇళ్లలోకి ప్రవేశించిన దుండగులు…యదేచ్చగా దొంగతనానికి తెగబడి, సుమారు 50 లక్షలమేర బంగారు ఆభరణాలు దొంగిలించి పోలీసులకు సవాల్ విసిరారు.

నక్కలంపేట గ్రామానికి చెందిన గుత్తా పుల్లారావు వ్యక్తిగత పనులమీద హైదరాబాద్ వెళ్లాడు. ఇంట్లో భార్య, అతని మామయ్య, నాయనమ్మ ఉన్నారు. గురువారం రాత్రి 12 గంటలకు నిద్రకుపక్రమించారు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ముగ్గురు దొంగలు గేటు దూకి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లోకి ప్రవేశించి, ప్రక్కన మనుషులు నిద్రిస్తున్నారనే భయం కూడా లేకుండా తాము వచ్చిన పని చక్కపెట్టుకున్నారు. ప్రక్కన ఉన్న బీరువాతాళాలు తీసుకుని బీరువా తెరిచి సుమారు 394 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల నగదు దొంగలించి ఉడాయించారు. నగదు బంగారంతో పాటు పక్కనే ఉన్న ఒక సూట్ కేసు కూడా సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. అందులో కేవలం దస్తావేజులు మాత్రమే ఉండటంతో వాటిని అక్కడే పడేసి పరారయ్యారు. దొంగలు వచ్చి వెళుతున్న సన్నివేశాలు సిసి పుట్టేజిల్లో రికార్డ్ అయ్యాయి.

దొంగలు తమ పనికి ముగించుకొని వెళ్లిన తర్వాత మూడు గంటల ప్రాంతంలో మెలకువ వచ్చి చూడగా ఇల్లంతా గందరగోళంగా పడి ఉండడంతో బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించటంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు దొంగలు తాళాలు పగలగొట్టి మరొక రెండు ఇళ్లలోకి ప్రవేశించి గాలించినా ఏమి దొరకలేదు. నక్కలంపేట గ్రామం జాతీయ రహదారికి ప్రక్కగా ఉండటంతో దొంగలు తప్పించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని, రెక్కీ నిర్వహించి దొంగతనానికి ఆ గ్రామాన్ని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు.

దొంగతనం సమాచారం తెలియగానే విజయవాడ రూరల్ డిసిపి లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావు, గ్రామీణ సిఐ ఎన్ వి ఎల్ నాయుడు లు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరుతెన్నులను పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంచికచర్ల ఎస్సై పి. విశ్వనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ దొంగతనాలు జోరందుకోవటంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.