Morram Pits I భీమ్‌గల్ లో విషాదం
Morram Pits I భీమ్‌గల్ లో విషాదం
భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ: సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మొరం గుంతల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదాన్ని నింపింది. లింబాద్రి గుట్ట సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. లింబాద్రి గుట్ట వద్ద కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మోహన్, లక్ష్మి దంపతుల పిల్లలు హరీష్ (11), వర్షిణి (6), దేవరంగుల సురేష్, పద్మ దంపతుల కుమారుడు అరవింద్ (5) మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంటి బయట ఆడుకునేందుకు వెళ్లారు.
ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిసర ప్రాంతాల్లో వెతికినా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని కుంట వద్ద పిల్లల దుస్తులు కనిపించడంతో కుటుంబ సభ్యుల్లో కలకలం రేగింది. ఆ కుంటలో మొరం తవ్వకాల కారణంగా ఏర్పడిన గుంతలు లోతుగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది.
ఎస్సై సీహెచ్. తిరుపతి ఆధ్వర్యంలో భీమ్‌గల్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు కుంటలో వెతకగా ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బిడ్డలు తిరిగి వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులు, వారి మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. కాసేపటి క్రితం వరకు కళ్లముందు తిరిగిన పిల్లలు ఇలా విగతజీవులుగా మారడంతో లింబాద్రి గుట్ట పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సీహెచ్. తిరుపతి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
