అంగన్వాడీ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత
అంగన్వాడీ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత
మైలవరం ఐసీడీఎస్ పరిధిలో 25 పోస్టుల భర్తీ
మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం
అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం: వసంత
విజయవాడ రూరల్ వెస్ట్, ఆంధ్రప్రభ: మైలవరం నియోజకవర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు నియామక పత్రాలు అందజేశారు. గురువారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మైలవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఇటీవల 2 అంగన్వాడీ వర్కర్లు, 23 అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు భర్తీ అయ్యాయి. ఎంపికైన మొత్తం 25 మంది మహిళలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వయంగా నియామక ధ్రువీకరణ పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. కొత్తగా నియమితులైన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు బాధ్యతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేస్తూ సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
నియామక పత్రాలు అందుకున్న మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగం రావడంతో తమ కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా లభించిందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
