ఎత్తిపోతల పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎత్తిపోతల పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

మక్తల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి

కాట్రపల్లి పంప్‌హౌస్ పనులపై ఆరా

ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష

మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ: ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మక్తల్‌కు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు డాక్టర్ వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

అనంతరం మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాట్రపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న పంప్‌హౌస్ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి, నిర్మాణ పనుల స్థితిగతులను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు.

పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

అనంతరం జూరాల, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాంతాలను సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజు, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ ఎ. సత్యనారాయణ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ హెచ్.టి. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply