Prime Minister Modi | స్వర్ణాంధ్రకు శ్రీకారం…
- భోగాపురం నుంచి అభివృద్ధి నాంది
- రూ.18 వేల కోట్ల అభివృద్ధి శ్రీకారం
- ఏపీకి అభివృద్ధి బూస్టర్
- వికసిత్ భారత్‌లో ఏపీ కీలకం
- ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా
- భోగాపురంతో కొత్త శకం
- ఏపీకి ప్రధాని అభివృద్ధి కానుక
- అభివృద్ధి దిశగా మరో భారీ అడుగు
- ఏపీకి రూ.18 వేల కోట్ల ఊపు
- వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్
- భోగాపురం నుంచి స్వర్ణాంధ్రకు బాట
Prime Minister Modi | విజయనగరం, ఆంధ్రప్రభ: స్వర్ణాంధ్ర విజన్-2047 సాకారానికి నేటి రోజు చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
సింహాచలం అప్పన్న స్వామి, పైడితల్లి అమ్మవారికి నమస్కారాలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని, 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధితో పాటు గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ కార్యక్రమం నిలిచిందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ను మరింత వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని, రోడ్డు, విమాన, పోర్టు కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తోందని కొనియాడారు.
2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని మోదీ తెలిపారు. ఒకే కుటుంబం పేర్లను విమానాశ్రయాలకు పెట్టే సంస్కృతికి స్వస్తి పలికామని, అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని గుర్తు చేశారు.
ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకూ విమాన సేవలను విస్తరించామని, దీంతో విమానాశ్రయాల సంఖ్యతో పాటు విమాన ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. పేదల కలలను సాకారం చేసేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పోర్టులను ఆధునీకరిస్తున్నామని, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టుల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ప్రధాన పారిశ్రామిక కారిడార్లతో వాటిని అనుసంధానం చేస్తున్నామని, పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా రైలు, రోడ్డు, పోర్టు, విమానాశ్రయాల అభివృద్ధిని సమగ్రంగా చేపడుతున్నామని వివరించారు.
సాఫ్ట్వేర్, ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని పేర్కొన్నారు. విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం కృషి చేస్తోందన్నారు.
వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక గ్రోత్ ఇంజిన్‌గా నిలుస్తుందని, బ్లూ ఎకానమీ అభివృద్ధిలోనూ రాష్ట్రానికి విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నక్కపల్లిలో మరో ఫార్మా కంపెనీ ఏర్పాటు కానుందని, విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ఆసియాలోనే అత్యంత కీలక పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అలాగే రాయలసీమలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు.
