ఆదిలాబాద్ లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి..!

  • కేంద్రమంత్రి అశ్విని కుమార్ ను కలిసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసి పట్టణ ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ ను హైదరాబాదులో కలుసుకొని ఇక్కడి సమస్యలు ఎమ్మెల్యే వివరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రాన్ని సమర్పించారు.

ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ ఓబి) , రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ యుబి) నిర్మాణాలకు నూటికి నూరు శాతం కేంద్రo నిధులు మంజూరు చేసి పనులు వేగంగా కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక రైల్వే బ్రిడ్జి ప్రాజెక్టులు నిధుల కొరతతో నిలిచిపోయినప్పటికీ, ఆదిలాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండానే కేంద్ర నిధులతో పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ పరిహారం కోసం పెండింగ్ లో ఉన్న రూ.14.89 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే కోరారు.

  • ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించండి..!

అదేవిధంగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ నుండి తాటిగూడ వరకు పాదచారులు, ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాల రాకపోకలకు అనువుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ ఓ బి) మంజూరు చేయాలని, దీంతో ప్రజల రవాణా భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని వివరించారు.
అలాగే గిమ్మ, బోరాజ్, మహాలక్ష్మీవాడ, ఆదిలాబాద్ అర్బన్ ప్రాంతాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం కొత్త రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ యు బి) మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి ఎమ్మెల్యే విన్నవించారు. సమస్యలను సానుకూలంగా ఉన్న కేంద్ర మంత్రి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.