కాలె యాదయ్య పైకి దూసుకొచ్చిన మృతుల కుటుంబ సభ్యులు

ధర్నా ప్రాంతం నుండి పరుగెత్తిన ఎమ్మెల్యే
తృటిలో తప్పించుకుని పారిపోయిన కాలె యాదయ్య
కొనసాగుతున్న మృతుల కుటుంబ సభ్యుల ధర్నా
ధర్నా ప్రాంతానికి వచ్చిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకున్న వరుస హత్యల ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మొత్తం ఆరుగురు హత్యకు గురికావడంతో బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఘటనపై పరామర్శించేందుకు వచ్చిన షాబాద్ ఎమ్మెల్యే కాలె యాదయ్యను బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా నిలదీశారు. ఆగ్రహంతో ఆయన వైపు దూసుకెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ తమ ఆందోళనను కొనసాగించారు. అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదిలా ఉండగా, పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరుస హత్యలతో షాబాద్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.