Flight Incident | డీకంప్రెషన్‌తో ప్రయాణికులకు టెన్షన్

Flight Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గ్రీస్ నుంచి జర్మనీకి బయలుదేరిన ర్యాన్‌ఎయిర్ విమానంలో గాల్లోనే భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రయాణ మధ్యలో ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఒక భాగం విడిపోయి విమానం కిటికీని బలంగా ఢీకొట్టింది. దీంతో కిటికీ ధ్వంసమై క్యాబిన్‌లో ఒక్కసారిగా గాలి పీడనం తగ్గి డీకంప్రెషన్ పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటనతో విమానంలోని ఆక్సిజన్ మాస్క్‌లు స్వయంచాలకంగా బయటకు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కిటికీ సమీపంలో కూర్చున్న ఓ ప్రయాణికుడు పాక్షికంగా బయటికి వచ్చినట్లు సమాచారం. అయితే సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాద తీవ్రతను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని గ్రీస్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.