ఎస్ఐఆర్ పై ఆందోళన వద్దు
ఎస్ఐఆర్ పై ఆందోళన వద్దు
మున్సిపల్ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ కుమార్
మంచిర్యాల, జూన్ 25 (ఆంధ్రప్రభ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల మున్సిపల్ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ కుమార్ అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించరని, మరణించిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను మాత్రమే జాబితా నుంచి తొలగిస్తారని స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల జాబితా సవరణపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఉచితంగా దరఖాస్తు ఫారాలను పంపిణీ చేసి తిరిగి సేకరిస్తారని చెప్పారు. ఓటర్ల పేర్లను విచక్షణారహితంగా తొలగిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమవుతున్న తప్పుడు కథనాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఓటర్ల వ్యక్తిగత వివరాల నవీకరణ కూడా ఈ ప్రక్రియలో భాగంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పడాల లింగారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) తదితరులు పాల్గొన్నారు.
