బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్…

బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్…
ఎమ్మెల్యే కూన రవికుమార్
రామచంద్రాపురంలో విగ్రహావిష్కరణ
ఆమదాలవలస, ఆంధ్రప్రభ : మంగళవారం బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు బస్ స్టేషన్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, అంబేడ్కర్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మాత్రమే కాకుండా, భారత రాజ్యాంగానికి రూపకర్తగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
ఆయన రచించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛలను కల్పించే అద్భుతమైన పత్రం అని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను నిర్మూలించేందుకు, అణగారిన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం అందించేందుకు అంబేడ్కర్ జీవితాంతం పోరాడారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్య, సమానత్వం, స్వాభిమానం అనే మూడు ప్రధాన విలువలను ప్రజల్లో పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి అపారమని తెలిపారు. విద్య పొందండి, సంఘటితమవండి,, పోరాడండి అనే అంబేడ్కర్ సందేశం ప్రతి తరానికి మార్గదర్శకమని అన్నారు.

అంబేడ్కర్ గారి ఆశయాలు ప్రతి ఇంటికీ చేరాలని, ఆయన చూపిన మార్గంలోనే సమాజం ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం కూడా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ వేడుకల్లో కూటమి ముఖ్య నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అంబేడ్కర్ జీవిత విశేషాలు, ఆయన పోరాటం, సమాజానికి చేసిన సేవలను వివరించారు. తరువాత ఆమదాలవలస మండలం రామచంద్రపురం గ్రామంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రవికుమార్ ఆవిష్కరించారు.
