త్వరలో చిట్యాల నూతన బస్టాండ్ ప్రారంభం
త్వరలో చిట్యాల నూతన బస్టాండ్ ప్రారంభం
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడితే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శనివారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ఇంకా పూర్తికాని ప్రహరీ గోడ, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్టాండ్ అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి కార్యాచరణ రూపొందించారు.
అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి నూతన బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ప్రజల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, తహసీల్దార్ వసంతరావు, చిట్యాల మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, ఏఆర్పల్లి సర్పంచ్ కొడారి అశోక్, నాయకులు రవీందర్, శ్రీనివాస్, కిష్టయ్య, నరేందర్, రాజు, లక్ష్మణ్, కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
