రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌దే..
మధిర, ఆంధ్రప్రభ : రైతును రాజును చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, రైతు సంక్షేమమే లక్ష్యంగా ఆయన అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు.
శుక్రవారం మధిరలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోలు విషయంలో ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని విమర్శించారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన ప్రతి పంటను కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా రైతులకు భరోసా కల్పించే విధానాలను అమలు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా 11 సార్లు పెట్టుబడి సాయం అందించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడుసార్లు మాత్రమే అందించిందని ఆరోపించారు. అలాగే ఎకరానికి అందించే సాయాన్ని కూడా తగ్గించిందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అనేక హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
ఈ సమావేశంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరు వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు మొండితోక జయకర్, రంగిశెట్టి కోటేశ్వరరావు, చిత్తారి నాగేశ్వరరావు, బిక్కీ ప్రసాద్, వై.వి. అప్పారావు, మాధవి తదితరులు పాల్గొన్నారు.
