వల్లపు చెరువు అభివృద్ధి పనులు పురోగతి..
- పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన వల్లపు చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు . ప్రధానమంత్రి కృషి యోజన- 2.0 కింద రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మే 22న అధికారికంగా పనులు ప్రారంభించారు. తొలి విడతగా రూ.50 లక్షల నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం చెరువు వద్దకు వెళ్లిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పల్నాడు జిల్లా డ్వామా పీడీ ఎం.సిద్ధాలింగమూర్తి పాల్గొన్నారు. అధికారులను పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకుని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరసరావుపేట పట్టణంలోని చారిత్రక వల్లపు చెరువును మోడల్ ట్యాంక్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి కృషి యోజన 2.0 నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటి భద్రత, భూగర్భ జలాల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన విహార వాతావరణం కల్పించనున్నట్లు చెప్పారు.ప్రస్తుతం చెరువులో పూడికతీత, ట్యాంక్‌బండ్ బలోపేతం, రిటైనింగ్ వాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్, పరిసర ప్రాంతాల శుభ్రత వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
తదుపరి దశలో ఇరువైపులా మొక్కల పెంపకం, సోలార్ లైటింగ్, పెద్దల కోసం బెంచీలు, చిన్నారుల కోసం పార్క్, బోటింగ్ సౌకర్యం వంటి ఆధునిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చెరువు మధ్యలో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మొత్తం ప్రాంతాన్ని ఆకర్షణీయమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.అదనంగా ప్రభుత్వ నిధులతో పాటు ఎన్ఆర్ఐల స్వచ్ఛంద సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో గుడి కమిటీ చైర్మన్ పాండురంగారావు, అధికారులు, టీడీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
