టీటీడీ దర్శనాలు రద్దు…

తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, ఆర్జిత కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను నిర్వహించబోమని తెలిపింది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతల ప్రత్యేక దర్శనాలు కూడా బ్రహ్మోత్సవాల కాలంలో రద్దు చేసినట్లు ప్రకటించింది. భక్తులు ఈ మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.