భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేష పూజలు

భక్తుల రద్దీ మధ్య ప్రత్యేక అర్చనలు, హారతులు

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ సమీపంలోని తాడిగడప గ్రామంలో వెలసిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య శ్రీవల్లి,దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రిషి ఆధ్వర్యంలో స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా విశేష అలంకరణ చేసి మహామంగళహారతి సమర్పించారు.

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోగా, “ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః”, “ఓం శరవణభవాయ నమః” నామస్మరణలతో భక్తులు పరవశించారు. ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.