ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించాలి.. ఏలూరులో జేఏసీ నిరసన

  • వెయ్యి సంతకాలతో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం
  • ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని డిమాండ్
  • ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని జేఏసీ నేతల విజ్ఞప్తి

ఏలూరు, ఆంధ్రప్రభ : ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (ఏపీపీటీడీ) రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సోమవారం ఏలూరులో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉద్యోగులు, ప్రజల నుంచి సేకరించిన వెయ్యి మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఐఏఎస్‌కు సమర్పించారు.

ఈ కార్యక్రమం జిల్లా జేఏసీ చైర్మన్లు కె. రమేష్ కుమార్, రాంబాబు, కో-కన్వీనర్ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా, రాష్ట్ర జేఏసీ చైర్మన్ కె. రమేష్ కుమార్ సమక్షంలో వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన, అందుబాటులో ఉండే ప్రజా రవాణా సేవలను అందించడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అలాంటి సంస్థను ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ బలహీనపడటమే కాకుండా, ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తూ, సంస్థను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా సేవల పరిరక్షణ, ఆర్టీసీ అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతుందని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.