అర్ధరాత్రి హైవేలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు..

అర్ధరాత్రి హైవేలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు..

ప్రమాదాల నివారణకు ‘స్టాప్-వాష్ అండ్ గో’!

ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జాతీయ, రాష్ట్ర రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల భద్రతను పెంపొందించేందుకు నంద్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై ప్రతిరోజూ “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.

జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ మరియు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జిల్లాలో సంచరించే వాహనాలను ఆపి డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. కడప-నంద్యాల హైవే, కర్నూలు-విజయవాడ జాతీయ రహదారి, నంద్యాల-కర్నూలు ఎన్‌హెచ్-44 మార్గంతో పాటు కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తూ నిబంధనల అమలుపై దృష్టి సారిస్తున్నారు. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాలను అతివేగంగా నడపకూడదని, రాంగ్ రూట్‌లో ప్రయాణించకూడదని డ్రైవర్లకు సూచిస్తున్నారు.

అలాగే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.

ఫొటో రైటప్: నంద్యాల జిల్లా హైవేపై ‘స్టాప్-వాష్ అండ్ గో’ కార్యక్రమంలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తూ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై సూచనలు చేస్తున్న పోలీసులు.

Leave a Reply