‘రోడ్డు వేయండి మహాప్రభో’.. చిన్నారుల వినూత్న నిరసన!
‘రోడ్డు వేయండి మహాప్రభో’.. చిన్నారుల వినూత్న నిరసన!
45 ఏళ్ల కాలనీకి రోడ్డు కరువు.. రూ.5 లక్షల నిధులు ఎక్కడంటూ ప్రశ్నలు
ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ ప్రతినిధి: “రోడ్డు వేయండి మహాప్రభో” అంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగిన ఘటన ఎమ్మిగనూరులో సోమవారం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా పరిష్కారం కాని రహదారి సమస్యపై కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలోని గాంధీనగర్‌లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో, దేవి అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న వీధి రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో స్థానికులు నిరసన చేపట్టారు. రహదారి మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో చిన్నారులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు లక్ష్మణ్ సాగర్, కైరుప్పలప్ప, నాగరాజు, మల్లికార్జున మాట్లాడుతూ.. గత 45 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని తెలిపారు. కాలనీలోని ఇతర వీధుల్లో రోడ్లు నిర్మించినప్పటికీ తమ వీధిని మాత్రం అధికారులు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
1998లో వేసిన తారు రోడ్డు ప్రస్తుతం పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారిందని పేర్కొన్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
సమస్యపై పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ)లో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. గత ఏడాది మే 31న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, ప్రాథమిక సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదన్నారు. పన్నులు ఆలస్యమైతే అధికారులు కఠినంగా వ్యవహరిస్తారని, కానీ ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.
