విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవానికి మంత్రికి ఆహ్వానం
- నెమలి–పీఠికొత్తూరు సబ్స్టేషన్ల ప్రారంభోత్సవానికి రావాలి
- మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు, ఆంధ్రప్రభ: తిరువూరు నియోజకవర్గంలో త్వరలో ప్రారంభం కానున్న నెమలి–పీఠికొత్తూరు విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆహ్వానించారు. అమరావతిలోని సచివాలయంలో ఉన్న మంత్రి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేసిన ఎమ్మెల్యే, తిరువూరు నియోజకవర్గంలో విద్యుత్ రంగ అభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. నెమలి–పీఠికొత్తూరు నూతన సబ్స్టేషన్లు అందుబాటులోకి రావడం ద్వారా విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఇరువురు చర్చించగా, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఎమ్మెల్యే మరోసారి మంత్రిని ఆహ్వానించారు.
