ప్రజలకు చేరువయ్యేలా పని చేయాలి..
- సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలి..
- సైబర్ నేరాలపై అప్రమత్తం చేయాలి..
- సిరిసిల్ల జిల్లా పోలీసుల పనితీరు భేష్
- రాజన్న జోన్- 3 డిఐజి సత్ సింగ్
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ప్రజలకు చేరువగా ఉంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని, ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందనతో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాజన్న జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆయనకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఘన స్వాగతం పలికారు.
గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డీఐజీ కార్యాలయ ప్రాంగణం, స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ) విభాగాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, డిజిటల్ డేటా వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం అమలు తీరుపై ఆరా తీసి జిల్లా పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తదనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, దర్యాప్తు ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సైబర్ నేరాల నివారణ, పెండింగ్ కేసుల పురోగతి, కమ్యూనిటీ పోలీసింగ్ తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించాలని, ముఖ్యంగా దొంగతనం కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన ఛేదించాలని సూచించారు. నమోదైన కేసుల్లో నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచేందుకు పటిష్ఠమైన దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో కన్విక్షన్ రేటు మెరుగ్గా ఉండటాన్ని అభినందించారు.
కోర్టు మానిటరింగ్ బృందం ప్రతి కేసును నిరంతరం పర్యవేక్షిస్తూ, సాక్షులు విచారణకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కనీసం ఐదు నుంచి ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి తన స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై పూర్తి సమాచారం కలిగి ఉండి, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని పేర్కొన్నారు.
జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని, గంజాయి సేవించే వ్యక్తులపై నిఘా కొనసాగించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఆదేశించారు.
అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగార్థం కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్‌ను డీఐజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
