తిరువూరుకు ప్రాధాన్యత ఇవ్వండి

  • అధిక సంఖ్యలో గృహ కాలనీలు మంజూరు చేయాలి
  • మంత్రి పార్థసారథిని కోరిన ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు, ఆంధ్రప్రభ: తిరువూరు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసేలా అధిక సంఖ్యలో గృహ నిర్మాణ కాలనీలు, ఇళ్లను మంజూరు చేయాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథిని కోరారు.

అమరావతి సచివాలయంలో గురువారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే, తిరువూరు నియోజకవర్గంలో గృహాల అవసరం, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తూ అత్యధిక సంఖ్యలో హౌసింగ్ కాలనీలు, ఇళ్లను మంజూరు చేసి పేద కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.