జగన్‌పై మంత్రి ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు!

జగన్‌పై మంత్రి ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు!

మెగా డీఎస్సీపై విష ప్రచారం ఫలించదు.. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్: మంత్రి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల వ్యామోహంతో తన కుటుంబ సభ్యులపైనా అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌పై పలు ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసకర పాలన నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందని పేర్కొన్నారు. కుటుంబ ఆస్తుల వివాదాల నేపథ్యంలో జగన్ వ్యవహారశైలిని విమర్శిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మైనార్టీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ

గత ఐదేళ్ల పాలనలో మైనార్టీల సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని మంత్రి ఆరోపించారు. నంద్యాల, కర్నూలు, అదోని, గుంతకల్, కదిరి, హిందూపురం ప్రాంతాల్లో పీఎంజీవై పథకం కింద నిర్మించిన మైనార్టీ వసతి గృహాల అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటి కోసం రూ.270 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కడపలో నిర్మించిన హజ్ భవన్, గుంటూరులో నిర్మాణంలో ఉన్న క్రిస్టియన్ భవన్ పనులను పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మైనార్టీల కోసం రూ.5 వేల కోట్లు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఫరూఖ్ పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

హజ్ యాత్రికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 1,630 మంది హజ్ యాత్రికుల్లో 331 మందికి ఈ సాయం అందించామని, గతంలో మిగిలిన 72 మందికి కూడా నిధులు విడుదల చేశామని వివరించారు.

ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు అందిస్తున్నామని, ‘తాలీం-ఏ-హునర్’ పథకం ద్వారా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రూ.6 కోట్లు వెచ్చించి 250 మంది మైనార్టీ విద్యార్థులకు విద్య అందిస్తున్నామని తెలిపారు.

‘తల్లికి వందనం’తో అందరికీ లబ్ధి

‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో అర్హులైన ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరేలా తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనివల్ల మైనార్టీ విద్యార్థులు కూడా అధికంగా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.

కర్నూలుకు త్వరలో హైకోర్టు బెంచ్

ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని మంత్రి స్పష్టం చేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.93 కోట్లు, కోర్టుల అభివృద్ధి కోసం రూ.190 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేశామని చెప్పారు.

సూపర్ సిక్స్ హామీలు అమలు చేశాం

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపించిందని మంత్రి పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందన్నారు.

ప్రతిపక్షాల దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఫరూఖ్ స్పష్టం చేశారు.