తాను పాఠాలు నేర్పే బడిలో కుమారుడిని చేర్పించి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : తాను చదువుకున్న పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ, అదే పాఠశాలలో తన కుమారుడిని ఒకటో తరగతిలో చేర్పించి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పలువురికి ఆదర్శంగా నిలిచారు.
రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని సీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు చాపలి గోపాల్ తన కుమారుడు లక్షిత్ నందను అదే పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురునాథ్‌కు అడ్మిషన్ ఫారం అందజేసి, తన కుమారుడి ప్రవేశాన్ని పూర్తి చేశారు. ఉపాధ్యాయుడు గోపాల్, ఆయన భార్య సునీతను ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గురునాథ్ మాట్లాడుతూ, “తన పిల్లలను ముందుగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన తర్వాతే ఇతరులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతానని గోపాల్ చెప్పడం అభినందనీయమని” అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో గోపాల్ తన మాటను నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్, శిరీష, వసుంధర, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
