అక్రమ నిర్మాణాల పై కన్నె ర్ర..

అనుమతుల్లేకుండా నిర్మించిన అరుణ గోదాం
సీజ్ చేసిన అధికారులు..
ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్….

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండలం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలపై పురపాలక అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మించిన గోదాంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం పరిశీలించి సోమవారం సీజ్ చేసింది.

మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి మహేష్ చంద్రకాంత్ ఆధ్వర్యంలో అధికారులు ఎల్లంపేట్‌లోని **గాట్సార్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్ (అరుణ గోదాం)**కు సంబంధించిన నిర్మాణాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించడంతో శనివారం నోటీసులు జారీ చేసి, సోమవారం గోదాంను సీజ్ చేశారు.

సీజ్ ప్రక్రియ సందర్భంగా స్థానిక వార్డు అధికారులు, పురపాలక సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు పాల్గొని బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించి చేపట్టే అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.