‘జగన్ 2.0 సూపర్ యాప్’తో డిజిటల్ పోరాటం
- రెడ్‌బుక్ రాజ్యాంగంపై వైసీపీ పోరాటం
- ప్రతి కార్యకర్తకు యాప్‌ను ఆయుధంగా మార్చుకోవాలి..
- పేదల ఇళ్ల స్థలాల రద్దుపై న్యాయపోరాటం
- అమరావతిలో పేదలకు స్థలాలు ఇవ్వరా?
- మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
- వైసీపీ పశ్చిమ కార్యాలయంలో యాప్ పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’పై డిజిటల్ వేదికగా పోరాటం చేసేందుకు ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ప్రతి వైసీపీ కార్యకర్త, అభిమాని వినియోగించుకోవాలని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలు, సమస్యలను నేరుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడం యాప్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలను యాప్‌లోని ప్రత్యేక ‘డిజిటల్ బుక్’లో నమోదు చేసే అవకాశం ఉందన్నారు.
సోషల్ మీడియాపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని వెలంపల్లి ఆరోపించారు. ప్రతి వైసీపీ కార్యకర్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అమరావతిలో గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని వెలంపల్లి ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 8 వేల నుంచి 9 వేల మంది పేదలకు కేటాయించిన స్థలాల రద్దుపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతి కేవలం ధనికులకేనా.. పేదలకు అక్కడ స్థానం లేదా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యారంగంలో గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మఒడి’, ‘నాడు-నేడు’ వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. 17 నూతన వైద్య కళాశాలల విషయంలోనూ ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జనసేన, బీజేపీపై కూడా వెలంపల్లి విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
