కుటుంబ పోషణ భారం బుడ్డోడి పైనే….!

కుటుంబ పోషణ భారం బుడ్డోడి పైనే….!

  • నాయనమ్మను కంటికి రెప్పలా సాకుతున్న మనవడు
  • ఆ ఇద్దరూ.. ఒక పూట తింటే గగనమే…
  • కడుపు నిండని కడుదయనీయ బ్రతుకులు…

వైరా, ఆంధ్రప్రభ : పలక, బలపం పట్టి బడికి వెళ్లాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలను మోస్తూ జీవన పోరాటం సాగిస్తున్న ఓ బాలుడి కథ ఇది. ఆటలు, పాటలు, చదువులతో గడపాల్సిన 13 ఏళ్ల వయసులో ఆకలి, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న ఆ బాలుడు పేరు శేఖర్.

వైరా పట్టణంలో నాయనమ్మ సోలంకి అంబతో కలిసి నివసిస్తున్న శేఖర్ ఇప్పటివరకు పాఠశాల గడప తొక్కలేదు. అక్షరం దిద్దని ఈ బాలుడికి ఆధార్ కార్డు కూడా లేకపోవడం అతని పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. అయినప్పటికీ నాయనమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

కుటుంబం చిన్నాభిన్నం

సుమారు 40 ఏళ్ల క్రితం గుజరాత్‌కు చెందిన సోలంకి ధనరాజ్, అంబ దంపతులు జీవనోపాధి కోసం వైరాకు వచ్చి స్థిరపడ్డారు. వినాయక విగ్రహాల తయారీ, విక్రయాలతో జీవనం సాగించేవారు. కుటుంబ పెద్ద ధనరాజ్ మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

వ్యాపార ఖర్చులు పెరగడం, కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవడం వంటి కారణాలతో కుటుంబం విడిపోయింది. చివరకు నాయనమ్మ అంబ, మనవడు శేఖర్ మాత్రమే కలిసి మిగిలారు.

చదువు దూరం… బాధ్యతలు దగ్గరం

శేఖర్ తండ్రి వసంత్ ప్రేమ వివాహం చేసుకుని ఆరుగురు సంతానానికి తండ్రయ్యాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో తల్లిదండ్రులు విడిపోవడంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అందులో నాలుగో సంతానమైన శేఖర్ ప్రస్తుతం నాయనమ్మతో ఉంటున్నాడు.

పని చేసి నాయనమ్మను పోషించాలనుకున్నా బాల కార్మిక చట్టాల కారణంగా ఎవరూ పని ఇవ్వడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ వైరా-తల్లాడ రోడ్డులోని ఓ అద్దె గదిలో నివసిస్తున్నారు. నెలకు రూ.6 వేల అద్దె చెల్లించాల్సి ఉండగా, ఆరు నెలలుగా అద్దె బకాయి పడినట్లు తెలిసింది.

వృద్ధాప్య పింఛనే ఆధారం

74 ఏళ్ల సోలంకి అంబకు వచ్చే రూ.2 వేల వృద్ధాప్య పింఛనే ప్రస్తుతం వారి ప్రధాన ఆధారం. ఆ డబ్బులతోనే ఇద్దరూ జీవనం కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్థానిక దాతలు ఆహారం, నిత్యావసర వస్తువులు అందిస్తూ సహాయం చేస్తున్నారు.

అందరినీ ఆకట్టుకునే శేఖర్

చదువు లేకపోయినా శేఖర్‌కు ఉన్న లోకజ్ఞానం, మాట్లాడే తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా, నాయనమ్మ సంక్షేమమే తన లక్ష్యంగా జీవిస్తున్నాడని పరిచయస్తులు చెబుతున్నారు.

తనకు ఉన్న కష్టాల కంటే నాయనమ్మ బాధల గురించే ఎక్కువగా ఆలోచించే శేఖర్‌ను చూసి పలువురు చలించిపోతున్నారు.

సహాయం కోసం ఎదురుచూపు

శేఖర్‌కు విద్య, గుర్తింపు పత్రాలు, భవిష్యత్తుకు అవసరమైన మద్దతు అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ బాలుడికి సరైన సహాయం అందితే భవిష్యత్తులో మంచి పౌరుడిగా ఎదిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

నాయనమ్మ, మనవడి ఈ జీవన పోరాటానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు చేయూతనిస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.