మావోయిజం అంతమైంది..

మావోయిజం అంతమైంది..
- పోలీసింగ్లో నూతన మార్పులు
- రోడ్డు భద్రత- ప్రతీ ఒక్కరి బాధ్యత
- సురక్షితంగా ఇంటికి చేరాలన్నదే లక్ష్యం
- అరైవ్- అలైవ్తో మంచి ఫలితాలు
- తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
రుద్రంగి, ఆంధ్రప్రభ : తెలంగాణలో మావోయిజం అంతమైందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాజన్న సిరిసిల్ల రుద్రంగి మండల కె ంద్రంలో రూ.2 కోట్ల 50 లక్షలతో ఎకరం స్థలంలో ఆధునిక హంగులతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేలతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిజం అంతమైందని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసింగ్లో నూతన మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు.
ప్రజల కేంద్రగానే సేవలు అందించేలా పోలీసులకు శిక్షణ ఇస్తామని, అదే స్థాయిలో విస్తృత సేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకో వాలని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం.. తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. హత్యలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో ఎక్కువ మరణాలు జరగడంలేదని, రోడ్డు ప్రమాదాల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు.
ద్విచక్ర వాహనదారులు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. పౌరులు బాగుంటే రాష్ట్రం.. దేశ అభివృద్ధి సాధ్యమని, ఇందులో భాగంగానే అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో వేములవాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, భీమారంలో పోలీస్ స్టేషన్ మంజూరుకు కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నానని తెలిపారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విశె ష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అండగా ఉంటున్నారని చెప్పారు.
అలాగే ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకమైనవి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. అన్ని సెలవుల్లో విధులు నిర్వర్తిస్తారని, ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొ నియాడారు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ తాను నిర్వహిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రుద్రంగి, భీమారంలో రెవెన్యూ, మండల పరిషత్ భవనాలు ఇస్తానని మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో తాను భాగస్వామి కావడం అదృష్టమని పేర్కొన్నారు.
