ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపడాలి
రోగులకు నాణ్యమైన చికిత్స, మందులు అందించాలి: ప్రభుత్వ విప్ విజయరమణారావు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత మెరుగుపడాలని, అవసరమైన మందులు, ఆధునిక వైద్య సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులను ఆదేశించారు.
శనివారం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విప్ విజయరమణారావు మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని, వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రత్యేక వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాల సమీకరణ, నిపుణులైన వైద్యుల నియామకం, అత్యవసర మందుల కొనుగోలు వంటి అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని, రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. గర్భిణులను తిరస్కరించకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలని, తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులను ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే పనులకే వినియోగించాలని, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
రోగులు ఇబ్బందులు పడకుండా సేవలను సమర్థంగా నిర్వహించాలని, తల్లి-శిశు ఆరోగ్య సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కె. శ్రీధర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర, మున్సిపల్ ఉపాధ్యక్షురాలు ముస్కాన్ నాజ్, రెడ్‌క్రాస్ సంఘం జిల్లా కార్యదర్శి కావేటి రాజగోపాల్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న, ఆసుపత్రి నివాస వైద్యాధికారి డాక్టర్ విజయకుమార్, ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
