మాంగ్ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలపై జీవో

సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం

జైనూర్ (ఆంధ్రప్రభ): మాంగ్ కులస్తులకు తహసీల్దార్ కార్యాలయాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉషగాం గ్రామంలో గురువారం మాంగ్ సమాజ్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్‌వాడ్ తులసీదాస్ మాంగ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మావలే దత్త మాంగ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాంగ్ కులస్తుల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చుతూ తహసీల్దార్ కార్యాలయాల ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు. గతంలో ఆర్డీవో కార్యాలయాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు మాంగ్ సమాజ్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తాజా నిర్ణయంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. మాంగ్ కులస్తుల అస్తిత్వాన్ని పరిరక్షించే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఉషగాం సర్పంచ్ ఆత్రం నిర్మల శశిపాల్, జంగాం మాజీ సర్పంచ్ కుమ్ర శ్యాంరావు, ఉషగాం మాంగ్ సమాజ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏడులే ప్రకాష్, నాయకులు కాంబ్లే సంగ్రామ్ మాంగ్, మోరే మహాదేవ్ మాంగ్, తారుడే గ్యానోబ మాంగ్, సూర్యవంశీ దత్త మాంగ్, మాంగ్ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.