అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకానికి శ్రీకారం

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం: సీడీపీఓ ఉమాదేవి

ఉట్నూర్ (ఆంధ్రప్రభ): చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి వారి ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉట్నూర్ సీడీపీఓ ఉమాదేవి అన్నారు. గురువారం ఉట్నూర్ మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించి చిన్నారులకు అందిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల శారీరక, మానసిక వికాసాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతిష్ఠాత్మకంగా అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు సూచించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.