ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయ నిధి

రూ.11.52 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: శ్రీకాకుళం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.11.52 లక్షల విలువైన 10 చెక్కులను లబ్ధిదారులకు గురువారం అందజేశారు.

అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, అత్యవసర వైద్య ఖర్చుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పది కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం అందించిన సహాయం తమకు ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి పథకాలు ఆపదలో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసి, నిజమైన అర్హులకు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు.

ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.