ఓఎన్‌జీసీ భారీ వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు

దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ధర్నా.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

బంటుమిల్లి, ఆంధ్రప్రభ: బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామంలో ఓఎన్‌జీసీ భారీ వాహనాలను గ్రామస్తులు అడ్డుకుని ధర్నా నిర్వహించారు. సాతులూరు రోడ్డులో ఓఎన్‌జీసీ రిగ్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి అర్తమూరు గ్రామం మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించారు. దీంతో ఆందోళనకు దిగిన గ్రామస్తులు గ్రామంలోకి వచ్చిన ఓఎన్‌జీసీ భారీ వాహనాలను అడ్డుకుని ధర్నా చేపట్టారు.

ఓఎన్‌జీసీ వాహనాల రాకపోకల వల్ల దెబ్బతిన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి, కొత్త రహదారి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.