పింఛన్లు పెన్షనర్ల జీవితానికి కనీస భరోసా:

పింఛన్లు పెన్షనర్ల జీవితానికి కనీస భరోసా:

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

కోడూరు, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెన్షనర్ల జీవితాలకు కనీస భరోసా కల్పిస్తున్నాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం కోడూరు మండలం లింగారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని పెద గుడుమోటు గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, మంచానికే పరిమితమైన వారు, పక్షవాత బాధితులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను పెంచి అందిస్తోందన్నారు. 2024 ఏప్రిల్ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు.

పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛన్, కిడ్నీ వ్యాధులు, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేల పింఛన్ అందజేస్తున్నట్లు వివరించారు.

గ్రామ పర్యటనలో భాగంగా గ్రామం నుంచి కాలువ వరకు ఉన్న ప్రధాన రహదారులు, దర్గా రోడ్డు, పెద్ద ఎస్సీ కాలనీ రోడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వాటి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే గ్రామంలోని రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును పరిశీలించి, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ సహకారంతో అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామ ప్రత్యేక అధికారులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధా ప్రవీణ్, గ్రామ ప్రత్యేక అధికారి, రీ-సర్వే డీటీ ఎన్. పద్మప్రియ, పంచాయతీ కార్యదర్శి లోయ శివ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ యర్రంశెట్టి శ్రీదుర్గ, మాజీ ఉపసర్పంచ్ బషీర్ అహ్మద్, సహకార సంఘ అధ్యక్షుడు కోట సుబ్బారావు, ఏఎంసీ డైరెక్టర్ బచ్చు ఆదినారాయణ, దాసరి వెంకట కృష్ణారావు, అప్పికట్ల శ్రీరామ్, జరుగు గంగాధర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.