వేగంగా అభివృద్ధి చెందుతున్న పికిల్‌బాల్ క్రీడ
వేగంగా అభివృద్ధి చెందుతున్న పికిల్‌బాల్ క్రీడ
3వ రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లో ఎంపీ, ఎమ్మెల్యే
పటమట, ఆంధ్రప్రభ:
అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా ఆడే క్రీడ పికిల్‌బాల్ అని, ఈ క్రీడ రాష్ట్ర స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్‌లో ఉన్న నెట్రో పికిల్‌బాల్ కేఫ్ ఆవరణలో మూడవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పికిల్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, అటవీశాఖ ఛైర్మన్ సుజయ రంగారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పికిల్‌బాల్ పోటీలు విజయవాడలో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా ఈ క్రీడ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ క్రమశిక్షణకు ప్రతీక అని, ఆయన ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్‌తో పాటు వ్యాయామం చేస్తారని ఎంపీ తెలిపారు. ఇలాంటి క్రీడలను నగరానికి తీసుకువచ్చిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పికిల్‌బాల్ పోటీలు నగరంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పికిల్‌బాల్ అన్ని వయస్సుల వారు ఆడగలిగే క్రీడ అని పేర్కొన్నారు. అటవీశాఖ ఛైర్మన్ సుజయ రంగారావు మాట్లాడుతూ, ఈ క్రీడ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు.

