పింఛన్ అందగానే చిరునవ్వులు.. 14వ డివిజన్‌లో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం

ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏలూరు నగరంలోని 14వ డివిజన్ పుప్పాల సూర్యనారాయణ కాలనీలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు పాల్గొని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రతి నెలా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఎవరూ ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

పింఛన్లు అందుకున్న వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెలా సకాలంలో పింఛన్ అందుతుండటంతో మందులు, నిత్యావసరాల కొనుగోలుకు ఎంతో ఉపయోగపడుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు మాట్లాడుతూ, 14వ డివిజన్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు చేరేలా సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అభినందించారు.

పింఛన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.

Leave a Reply